బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన తెలంగాణ బిడ్డ గుర్రం సత్యనారణ
హైదరాబాద్: మహారాష్ట్ర రాష్ట్రం సోలాపూర్ నగరంలో ఇటీవల నిర్వహించిన మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ యువ నాయకుడు ఘన విజయం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన పద్మశాలి బిడ్డ గుర్రం సత్యనారాయణ రామస్వామి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 13వ వార్డు కార్పొరేటర్‌గా విజయం సాధించారు.
గుర్రం రామయ్య కుమారుడైన సత్యనారాయణ వ్యాపార నిమిత్తం కొన్నేళ్లుగా మహారాష్ట్రలోని సోలాపూర్ నగరంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను దగ్గరుండి తెలుసుకుంటూ, అవసరమైన సందర్భాల్లో వెంటనే స్పందిస్తూ ప్రజాసేవలో ముందుండటం ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణ తెచ్చిపెట్టింది.
పద్మశాలి కుటుంబానికి చెందిన సత్యనారాయణ స్వతహాగా దైవభక్తి కలిగిన వ్యక్తి. సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా అనేక సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానికుల్లో విశ్వాసాన్ని సంపాదించారు. ఈ సేవా భావనే ఆయన ఎన్నికల విజయానికి బలమైన పునాదిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజాసేవపై ఆయనకు ఉన్న నిబద్ధతను గుర్తించిన భారతీయ జనతా పార్టీ నాయకత్వం, సోలాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆయనను 13వ వార్డు అభ్యర్థిగా బరిలోకి దించింది. ఫలితంగా ప్రజలు ఆయనపై విశ్వాసం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించారు. తెలంగాణ గడ్డపై పుట్టి మహారాష్ట్రలో ప్రజాప్రతినిధిగా ఎన్నికవడం రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది.