వార్త పత్రిక షాద్ నగర్ మే04
రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్ కార్డుల పంపిణీ
నేలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేసిన రైతులు
నానో ఎరువులు,మట్టి నమూనా పరీక్షలు, ప్రకృతి వ్యవసాయం పై అవగాహన
ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఫరూఖ్ నగర్ మండలంలోని ఐదు రైతు వేదికలలో సోమవారం రైతు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వ్యవసాయ విస్తరణ అధికారులు భూసార పరీక్ష విధానము, ఎరువుల సమతుల్యత మరియు నానో ఎరువుల వాడకం గురించి వివరించడం జరిగింది.ఈ సందర్భంగా రైతులకు పంటల వారీగా ఎరువుల వినియోగంపై అవగాహన కల్పిస్తూ, నీటి నిర్వహణ, పంటల మార్పిడ పచ్చి రొట్ట పంటల ప్రాధాన్యత గురించి కూడా వివరించడం జరిగింది. అలాగే సమయానుకూలంగా పంటల పరిశీలన చేయడం ద్వారా తెగుళ్లు, పురుగులను ప్రారంభ దశలోనే గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా రైతులు తమ పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకోవాలని దీని వల్ల పోషకాల లోపాలను గుర్తించి తద్వారా సమగ్ర పోషక యాజమాన్యం పాటించవచ్చని తెలపడం జరిగింది. ప్రభుత్వం రెవెన్యూ గ్రామానికి ఒక సాయిల్ వాలెంటర్లను నియమించిందని వీరి ద్వారా గ్రామంలోని రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించి తద్వారా వచ్చిన భూసార పరీక్ష కార్డు ద్వారా పోషక లోపాలను గుర్తించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ మరియు జీవన ఎరువుల వైపు రైతులు ఆలోచించాలని, సహజసిద్ధమైన వ్యవసాయం ద్వారా పెట్టుబడి తగ్గడంతో పాటు రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. సరైన పద్ధతిలో సరైన మోతాదులో సరైన సమయంలో ఎరువులు యాజమాన్యం పాటిస్తే చాలావరకు తెగుళ్లు మరియు పురుగుల బెడద ఉండదని వివరించారు.గత నెలలో మట్టి నమూనాలను సేకరించిన కొందరి రైతుల ఫలితాల కార్డులను కూడా అందజేయడం జరిగింది. సాంప్రదాయ యూరియాతో పోలిస్తే నానో యూరియాలో ఎంతో లాభదాయకంగా ఉంటుందని, ఇది నేరుగా పత్రాలపై పడి పత్ర రంద్రాల ద్వారా అమోనికల్ నైట్రేట్ రూపం నుంచి నైట్రేట్ రూపంలోకి మారి మొక్క అంతటికి సుమారు 80% వరకు లభ్యమవుతుందని తెలిపారు. అలాగే ఇది వాతావరణానికి హానికరం కాదని వివరించారు.అలాగే రైతు సోదరులందరూ ఎరువుల నియంత్రణ పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని, ఇది మానవాళి మనుగడకు ఎంతో అవసరమని చెప్పారు. అవసరానికి మించి ఒకే విడతలో ఎరువుల వాడకము చేయకూడదని, విడతల వారీగా వాడడం వల్ల మొక్కలు సమతుల్యంగా పెరుగుతాయని తెలిపారు.రైతులందరూ సమగ్ర ఎరువుల యాజమాన్యం, పోషకాల సమతుల్యత, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించి సరైన యాజమాన్యం పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమాల్లో సంబంధిత సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.