కోట జనవరి 29 వార్త పత్రిక ప్రతినిధి
77వ గణతంత్ర దినోత్సవ వేళ మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఒక పరిణామం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు ప్రస్తావించకుండా గణతంత్ర వేడుకలు నిర్వహించడం పై బహుజన ఐక్యవేదిక తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది." "మహారాష్ట్రలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక బిజెపి మంత్రి, తన ప్రసంగంలో ఎక్కడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ చర్యను బహుజన ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు దాసరి.సుందరం, రాష్ట్ర అధ్యక్షులు మిజురు.మాధవ్ లు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం వల్లే మంత్రి పదవులు అనుభవిస్తూ..అదే రాజ్యాంగ నిర్మాతను విస్మరించడం అంబేద్కర్‌ను అవమానించడమేనని వారు మండిపడ్డారు. ఇది పొరపాటున జరిగింది కాదు. ఉద్దేశపూర్వకంగానే అంబేద్కర్ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నమని వారు ఆరోపించారు. ప్రపంచం మొత్తం గమనిస్తున్న ఇలాంటి వేదికల పై ఇలాంటి ధోరణి సరికాదని హితవు పలికారు." అదే కార్యక్రమంలో ఉన్న ఒక ప్రభుత్వ మహిళా అధికారి ప్రదర్శించిన ధైర్యం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. మంత్రి ప్రసంగంలో అంబేద్కర్ పేరు లేకపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. వెను వెంటనే మంత్రిని నిలదీస్తూ..'అంబేద్కర్ పేరు ప్రస్తావించకుండా రిపబ్లిక్ డే చేస్తారా?' అని ఆమె ప్రశ్నించిన తీరు గర్వించదగ్గ విషయమని దాసరి.సుందరం, మిజురు. మాధవ్ లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్య వేదిక గౌరవ అధ్యక్షుడు దాసరి సుందరం, రాష్ట్ర అధ్యక్షులు మీజురు మాధవ్, టీచర్ పాల మల్లికార్జున రావు, భూపతి మోహన్ సాయి, కనుపూరు.వెంకట కృష్ణయ్య, లెక్చరర్ మిజురు. శ్రీనివాసలు పాల్గొన్నారు.