యూత్ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ సొలం రాంబాబు డిమాండ్
వార్తాపత్రిక, ములుగు, జూన్ 10: తాడ్వాయి మండల ప్రాథమిక రైతు సహకార సొసైటీ (పీఏసీఎస్) చైర్మన్ పదవిని మేడారం ప్రాంతానికి చెందిన చదువుకున్న యువ రైతుకు కేటాయించాలని యూత్ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ సొలం రాంబాబు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు, వ్యవసాయ అవసరాలపై అవగాహన ఉన్న వ్యక్తికి అవకాశం కల్పిస్తే సహకార సంఘం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ప్రఖ్యాత సమ్మక్క-సారలమ్మ జాతరకు కేంద్రంగా ఉన్న మేడారం ప్రాంత ప్రజల్లో అత్యధికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంత రైతుల అవసరాలు, వ్యవసాయ పరిస్థితులపై అవగాహన ఉన్న యువతకు బాధ్యతలు అప్పగించాలని కోరారు. రైతులకు పంట రుణాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకునే నాయకత్వం అవసరమని అన్నారు. సహకార సంఘాల నిర్వహణలో పారదర్శకత, రైతు ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.