Banner
Watermark
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలి
📅 10 June 2026, 11:26 AM ✍️ admin
News Image
వార్తాపత్రిక, న్యూఢిల్లీ, జూన్ 10: దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించేందుకు 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి పార్లమెంట్‌లో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ డిమాండ్ చేశారు. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తించకపోవడం వల్ల సామాజిక, ఆర్థికంగా తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా అంశంపై ఢిల్లీలో జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ నేతృత్వంలోని జాతీయ విచారణ కమిషన్‌ను బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా మేడె రాజీవ్ సాగర్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను సమానంగా గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాల్సిన అవసరాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రిజర్వేషన్లు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక అంశాలపై కమిషన్ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు బీఆర్ఎస్ బృందం సమగ్ర వివరాలు అందించిందన్నారు.
దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలోనూ, పార్లమెంట్‌లోనూ పోరాటం కొనసాగిస్తుందని రాజీవ్ సాగర్ స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్టీ తరఫున ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు దళిత సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home