భైరవరం గ్రామంలో వన్ మంత్ వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్ నాలుగవ విజిట్
దుత్తలూరు జనవరి 28( వార్త పత్రిక ప్రతినిధి)
జిల్లా కలెక్టర్ ప్రవేశపెట్టిన ‘వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్’ కార్యక్రమాన్ని దుత్తలూరు మండలం భైరవరం గ్రామంలో బుధవారం విజయవంతంగా నాలుగవసారి నిర్వహించినట్లు స్థానిక తహశీల్దార్ యనమల నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త అసైన్‌మెంట్ భూముల పంపిణీ, నోషనల్ ఖాతాలకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర రెవెన్యూ సమస్యలపై గ్రామ ప్రజల నుండి మొత్తం 30 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ఇప్పటికే గతంలో మూడు సార్లు నిర్వహించిన ‘వన్ మంత్ వన్ విలేజ్’ కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్‌కు నివేదిక రూపంలో పంపించామని, వాటిలో కొన్ని సమస్యలను పరిష్కరించామని వివరించారు. ఈ నాలుగవ విజిట్‌లో వచ్చిన అర్జీలను కూడా ఒక వారం వ్యవధిలో పూర్తిగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోనిపర్తి రమణమ్మ, స్థానిక ఎస్‌హెచ్‌ఓ, డిప్యూటీ ఎంపీడీఓ మల్లికార్జున, రెవెన్యూ సిబ్బంది, సర్వే సిబ్బంది, భైరవరం గ్రామ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, గ్రామస్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ సూచించారు.