Banner
Watermark
నిజాంపేట్ డబుల్ బెడ్‌రూమ్స్ వద్ద డంపింగ్ యార్డ్ తొలగించాలి: సీపీఎం డిమాండ్
📅 05 January 2026, 05:41 PM ✍️ Editor
News Image
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిజాంపేట్ సర్కిల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేత

నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని డబుల్ బెడ్‌రూమ్స్ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిజాంపేట్ సర్కిల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఎం మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కమిటీ సభ్యుడు రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ, డబుల్ బెడ్‌రూమ్స్ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ కారణంగా స్థానిక ప్రజల ఆరోగ్యాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త పేరుకుపోవడంతో ఈగలు, దోమలు, వీధి కుక్కలు, పందులు, ఎలుకలు విపరీతంగా పెరిగి ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నాయన్నారు. దుర్వాసనతో అక్కడ నివసించడం అసాధ్యంగా మారిందని తెలిపారు.

దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయని, డంపింగ్ యార్డ్‌ను ఆనుకొని మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణం పూర్తయినా, చెత్త సమస్య కారణంగా కళాశాల ప్రారంభం ఆలస్యమవుతుందనే అనుమానం వ్యక్తం చేశారు. బాచుపల్లి, నిజాంపేట్ డబుల్ బెడ్‌రూమ్స్, తెలుగు యూనివర్సిటీ, మహిళా డిగ్రీ కళాశాల, సాయి నగర్, రాజీవ్ గృహకల్ప పరిసర కాలనీల ప్రజలు ఈ డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ సమస్యపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాగే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. గతంలో డంపింగ్ యార్డ్‌ను తరలిస్తామని చెప్పినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే డంపింగ్ యార్డ్‌ను అక్కడి నుంచి తరలించాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని సీపీఎం పార్టీ హెచ్చరించింది.

ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ రాజీవ్ గృహకల్ప శాఖ కార్యదర్శి ఎన్. బాలపీర్, పార్టీ నాయకులు పి. స్వామి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home