Banner
Watermark
మాడ్గుల గ్రామంలో ఇంటింటికీ సోలార్ విద్యుత్ పథకం విస్తృత సర్వే ప్రారంభం
📅 04 January 2026, 11:25 PM ✍️ Editor
News Image
ప్రతి ఇంటిని కవర్ చేస్తూ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు

వినూత్న పథకానికి మాడ్గుల ప్రజలు కృతజ్ఞతలు

మాడ్గుల గ్రామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న ఇంటింటికీ సోలార్ విద్యుత్ పథకం కింద విస్తృత స్థాయి సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామంలోని ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన, నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఈ సర్వేను చేపట్టారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఈ వినూత్న పథకానికి మాడ్గుల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సర్వేను స్టార్ పవర్ఎక్స్ సోలార్ ఎనర్జీ సంస్థ ప్రతినిధులు గ్రామవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో మొత్తం 943 ఇళ్లు ఉన్నట్లు గుర్తించగా, ప్రతి ఇంటిని కవర్ చేస్తూ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి ప్రత్యేక సోలార్ యూనిట్ ఏర్పాటు చేయనుండగా, ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.1.20 లక్షల వరకు వ్యయం అవుతుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

గ్రామ సర్పంచ్ రజిత దేవేందర్ గౌడ్, మాజీ ఎంపీపీ జంగయ్య ఆధ్వర్యంలో ఈ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాడ్గుల గ్రామాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ సోలార్ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని గ్రామస్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం కొనసాగుతున్న సర్వే పూర్తయ్యాక అర్హులైన ఇళ్ల జాబితాను సిద్ధం చేసి, తదుపరి దశలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రత్యేక ప్రతినిధి, SHIVA KUMAR BS
🏠 Home